ఎ.ఎన్. జగన్నాథశర్మ తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
హనుమంతరావుగారు చెప్పింది నిజం. చలసాని ప్రసాదరావుగారికి చిన్నప్పుడు టైఫాయిడ్ వచ్చి, వినికిడి పోయింది. మాటపోలేదు. అయితే తాను ఏ బేస్ లో మాట్లాడుతున్నారో తెలియక, వారు అదో గొంతుతో మాట్లాడేవారు. ఆ మాట మనకి అర్థమయ్యేదికాదు.
వారికి వినిపించదు కనుక, చిట్టీల మీద రాసి మనని చూపించమనేవారు. వారు మాత్రం రాసేవారు కాదు. మాట్లాడేవారు. అర్థంకాకపోతే వారు కూడా రాసి అప్పుడప్పుడూ చూపించేవారు.
ఈ సందర్భంగా…నిజంగా జరిగిన ఒకనొక సంఘటన ఇక్కడ చెబుతాను. ఇది అప్రస్తుతం అయినా సహోద్యోగిని సరదాగా తలచుకోవడం నాకు మహదానందం.
శంకరాభరణం సినిమా విడుదలయింది. విజయఢంకా మోగిస్తున్నది. చూడనివ్యక్తి లేడు. తానూ ఆ సినిమా చూస్తానన్నారు చలసాని. ‘అది సంగీతపరమైనది. మీకు అవసరమా?’ అని తెగించి అడగలేకపోయాను వారిని.
‘‘పదండయితే, చూద్దాం’’ అన్నాను.
సినిమాకు బయల్దేరాం.
కోఠీలోని రాయల్ థియెటర్లో ఇద్దరం సినిమాచూశాం. తర్వాత ఆ పక్కనే ఉన్న స్వీట్ స్టాల్ కి వెళ్లాం.
‘‘ఏం తింటావు?’’ అడిగారు నన్ను చలసాని.
కోవా, ఉల్లిపకోడా చూపించాను.
వాటిని రెండేసి ప్లేట్లు తెమ్మని చెప్పారు చలసాని. తింటూ ఇద్దరం మాటల్లో పడ్డాం. ఆ రోజుల్లో కాళీపట్నంగారికి సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. విరసంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఆ అవార్డు కాళీపట్నం తీసుకోవడం ఎంత వరకూ సమంజసం అన్నది చర్చ.
‘‘తప్పేం ఉంది? తీసుకోవచ్చు.’’ అంటాను నేను. ఆ సంగతిని చేతివేలితో గాలిలో రాసి చెప్పాను. (చలసానిగారికి గాలిలో రాసినా అర్థం అయ్యేది.)
కూడదంటూ చలసాని మాట్లాడుతున్నారు.
చర్చ పాకానపడ్డది. నా భావాలన్నీ కూడా తెచ్చుకున్న న్యూస్ ప్రింట్ మీదా, గాలిలోనూ రాస్తూ రెచ్చిపోతున్నాను.
చలసాని కూడా గట్టిగా మాట్లాడుతూ, మరింతగా రెచ్చిపోతున్నారు.
ఇదంతా మాకు కోవా, పకోడీ సప్లయ్ చేసిన సర్వర్లు చూసి, నవ్వుకుంటున్నారు. వారి నవ్వునీ, అందులోని అంతరార్ధాన్నీ చలసాని గమనించారు. గమనించి, సన్నగా నవ్వుతూ…
‘‘వాళ్లు నిన్ను మూగవాడు అనుకుంటున్నారు.’’ అన్నారు నాతో.
అంతే! నాకు నవ్వాగలేదు. నవ్వుతూనే…
‘‘ఇదిగో! మీరిద్దరూ ఇలా రండయ్యా.’’ అని సర్వర్లను పిలిచాను.
వారు షాకయ్యారు.
1970-80 దశకాల్లో రేడియోల్లోనూ, పత్రికల్లోనూ వచ్చిన ఇంటర్వ్యూలు చదివి, మా నాన్న పెదవి విరిచేవారు.
ఏమైంది? ఇంటర్వ్యూ బాగానే ఉందిగా? అంటే…ఇంటర్వ్యూలు ఎప్పుడూ వృత్తిరీత్యా చెయ్యకూడదురా! ఆసక్తిమీదా, అనురక్తిమీదా చెయ్యాలనేవారు. అసలు ఇంటర్వ్యూ చేసే వ్యక్తిమీదే, ఏ వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నామో ఆ వ్యక్తి ‘పెంపు’ ఆధారపడుతుందనేవారు.
అలాగే ఇటు ఇంటర్వ్యూ చేసే వక్తికీ, అటు ఇంటర్వ్యూ చేయబడుతున్నవక్తికీ ఇద్దరికీ ఒకరిమీద ఒకరికి గౌరవ మర్యాదలు ఉండాలనేవారు. అంతేకాదు, నిజానికి ఇంటర్వ్యూలో బలం అంతా ఇంటర్వ్యూ చేసే వ్యక్తిమీదే ఆధారపడతుందనేవారు.
ఆనాడు అవి చాదస్తపు మాటలు అని కొట్టిపారేశాను. తర్వాత్తర్వాత అవి గొప్పమాటలని తెలిశాయి. ఇన్నాళ్లకు ‘ఈమాట’ లో వేలూరిగారితో ఓ సంభాషణ చదివి, నాన్న మాటలు నిజమనిపించాయి. మా నాన్నంటే నాకు మరింత గౌరవం పెరిగింది. అలాగే వేలూరిగారిమీదా, వారిని ఇంటర్వ్యూ చేసిన పరుచూరి శ్రీనివాస్, సాయి బ్రహ్మానందం గొర్తిమీదా కూడా గౌరవం పెరిగింది.
ఇంతటి గొప్ప ఇంటర్వ్యూని ప్రచురించిన ‘ఈమాట’కు అభినందనం. అభివందనం.