కొడవళ్ళ హనుమంతరావు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;కొడవళ్ళ హనుమంతరావు

మెచ్చుకున్నందుకు రంగారావుకి థాంక్స్. “ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టక మునుపు ఎడిసన్ ఏ దీపపు కాంతిలో ప్రయోగాలు చేశారో చెబితే బాగుండేది.” నిజమే; ఎడిసనే కాదు, ఎవరైనా చీకటిని ఎలా ఛేదించేవారు?

రాబర్ట్ గోర్డన్, తన ఉద్గ్రంథంలో [1] అంటాడు: “an essential characteristic of the 1870 dwelling was its dimness after dark.” ఎక్కువగా ఇళ్ళల్లో కొవ్వొత్తులు, తిమింగిల తైల దీపాలు (whale oil lamps) వాడేవారు; పెన్సెల్వేనియాలో 1850 ప్రాంతాల్లో కనుగొన్న కిరొసిన్ దీపాలు అప్పటికింకా కొత్త. తిమింగిలం చర్మాన్ని బాగా మరగబెట్టితే దాని కొవ్వునుండి వచ్చేది తిమింగిల తైలం. Herman Melville (1819-1891) ప్రఖ్యాత 1851 అమెరికన్ నవల “మోబీ-డిక్” (ముందటి పేరు “The Whale”) నుండి:

“Assuming the blubber to be the skin of the whale; then, when this skin, as in the case of a very large Sperm Whale, will yield the bulk of one hundred barrels of oil; and, when it is considered that, in quantity, or rather weight, that oil, in its expressed state, is only three fourths, and not the entire substance of the coat; some idea may hence be had of the enormousness of that animated mass, a mere part of whose mere integument yields such a lake of liquid as that. Reckoning ten barrels to the ton, you have ten tons for the net weight of only three quarters of the stuff of the whale’s skin.

It does seem to me, that herein we see the rare virtue of a strong individual vitality, and the rare virtue of thick walls, and the rare virtue of interior spaciousness. Oh, man! admire and model thyself after the whale! Do thou, too, remain warm among ice. Do thou, too, live in this world without being of it. Be cool at the equator; keep thy blood fluid at the Pole. Like the great dome of St. Peter’s, and like the great whale, retain, O man! in all seasons a temperature of thine own.

But how easy and how hopeless to teach these fine things! Of erections, how few are domed like St. Peter’s! of creatures, how few vast as the whale!”

మెన్లో పార్క్ ల్యాబ్ లో కొవ్వొత్తులు, కిరొసిన్ దీపాలు, గ్యాస్ దీపాలు వాడేవాళ్ళు. గ్యాస్ దీపాలకన్నా విద్యుద్దీపాలు చవకగా అందరికీ అందుబాటులోకి రావాలన్నది ఎడిసన్ ధ్యేయం: “to effect exact limitation of all done by gas, to replace lighting by gas by lighting by electricity.”ఎడిసన్ సమాంతర సర్క్యూట్ గ్యాస్ దీపాలని అనుసరిస్తూ వచ్చినదే.

[1] The Rise and Fall of American Growth: The U.S. Standard of Living Since the Civil War. Robert J. Gordon. Princeton University Press. 2016.

కొడవళ్ళ హనుమమంతరావు


06 April 2025 11:07 AM

ఈమాట;కొడవళ్ళ హనుమంతరావు

శర్మ గారి ఉదంతం సరదాగా ఉంది. ‘అది [శంకరాభరణం] సంగీతపరమైనది. మీకు అవసరమా?’ అంటే నాకీ చలసాని రచన గుర్తొచ్చింది:

ఏడాదిన్నర క్రితం, అమెరికాలో పర్యటిస్తుండగా…!

వాషింగ్టన్ లోని మా ‘హోస్టు’ల ఇంట్లో నేనదివరకే చూసేసి, మళ్ళీ చూడాలనుకుంటున్న ఇంగ్లీషు సినిమాల వీడియో కాసెట్లనేకం కనిపించేయి.

వాటిల్లోనుంచి నాకు మరీ ఇష్టమైన నాలుగింటిని ఎన్నిక చేసేను. వాటిల్లో ఓ కాసెట్ మా ఆవిడకు చూపించి అడిగేను. “మూడు నాలుగ్గంటలు పడుతుందీ సినిమా! అద్భుతంగా ఉంటుంది గానీ, చూసే ఓపిక ఉందా?” అని అప్పుడు రాత్రి తొమ్మిది గంటలు! మేమిద్దరం పగలంతా మ్యూజియంలు, ఆర్టు గ్యాలరీలు చూసి, చూసి, నడిచి, నడిచి అలసిపోయున్నాం.

“చూద్దాం! కానీ, పేరుని బట్టి చూస్తే ఇదేదో “మ్యూజిక్” సిన్మాలా ఉందే. మరి మీరు…?” అని సందేహించిందావిడ.

“అవును! నేనీ సిన్మా ముప్పయేళ్ళ క్రిందటనుకుంటా, మొదటిసారిగా హైదరాబాదులో చూశాను. అప్పటికే నాకు బ్రహ్మచెవుడు గదా! అదే సినిమాను మళ్ళీ ఇప్పుడు చూడాలంకుంటున్నానంటే… వింటూ నువ్వింకెంతగా ఎంజాయ్ చేయగలవో గదా!” అని కాసెట్ ను విసిఆర్ లో కెక్కించాను.

నాకే ఆశ్చర్యం కలిగేలా… సుదీర్ఘమైన ఆ సినిమా పూర్తయేదాకా ఆవిడ లేవలేదు, కదల్లేదు!

“చాలా చాలా బాగుందండీ! ఇదింత బాగుంటుందని మీకెలా తెలిసిందీ?” అని ఆశ్చర్యపోయిందామె మరే ప్రపంచం నుండో ఈ బాహ్య ప్రపంచంలోకి వచ్చిపడిన దానిలా!

“నీవు చెవులతో వింటావు! నేను కళ్ళతో వింటాను” అన్నాన్నేను.

ఆ సినిమ పేరు “సౌండ్ ఆఫ్ మ్యూజిక్!”

కథ, కథనం, నటన, సంగీతం, పాటలు, ఛాయాగ్రహణం, లొకేషన్లు, అన్నీ అందంగా కలగలసిపోయిన అపురూప చిత్రమది. అక్షరాలా కళాఖండం!

ఆనాడు నన్నంతగా ఆకట్టుకున్నదా కళాత్మకతే! ఆంగ్ల చిత్రాల పట్ల అంతగా ఆసక్తి చూపని మా ఆవిడను సంభ్రమంలో ముంచి తదాత్మ్యతకు లోను చేసిందీ ఆ కళాత్మకతే!

అదీ కళ! కళ అంటే అది!

— “వాళ్ళు…,” కబుర్లు, ఈనాడు, 9-4-1997, “రసన,” చలసాని ప్రసాదరావు.

వేలూరి గారు, “సంజీవదేవ్‌కి రంగులు తెలియవు,” అంటే మనసు చివుక్కుమంది. చిత్రకళ గురించి నాకేమీ తెలియదు కనుక మిన్నకుంటాను. ముగించే ముందు, సంజీవదేవ్ మొదటి పుస్తకం, “రసరేఖలు.” దాని ఎడిటింగ్ లో నార్ల చిరంజీవికి సహకరించిన ఇరవై రెండేళ్ల కుర్రాడు, ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో చిత్రకళా విద్యార్థి తనేనంటూ, చలసాని, “అది 1963 ఏప్రిల్ నాటికి తెలుగులో చిత్రకళకు సంబంధించిన ఏకైక గ్రంథం,” అన్నారు.

కొడవళ్ళ హనుమంతరావు


04 April 2025 10:20 AM

ఈమాట;కొడవళ్ళ హనుమంతరావు

చక్కగా ఇంటర్వ్యూ చేసినందుకు పరుచూరి, గొర్తి గార్లకు, ఇచ్చినందుకు వేలూరి గారికి, ప్రచురించినందుకు సంపాదకులకు, కృతజ్ఞతలు. అమూల్యమైన ప్రచురణ అయినా, ఒకటి రెండు నచ్చనివి ప్రస్తావిస్తాను.

“శ్రీశ్రీ అమెరికా వచ్చారా?” అని అడిగి, వెంటనే, “మీరు శ్రీశ్రీగారి మాటల్ని రేడియో స్టేషన్‌లో రికార్డు చేయించారు కదా!” అనడం అసంబద్ధంగా ఉంది.

“ప్రసాదరావుగారు మాట్లాడలేక పోయేవారు. అప్పటికే మాట పోయింది. పేపర్‌ మీద నోట్‌ లాగా రాసిస్తుండేవాడిని. … చలసాని ప్రసాదరావుగారి గురించి తెలుసుకోవాలంటే… He is a peculiar person. చాలా తక్కువమందికి తెలుసును.”

చిన్నప్పుడే చలసానికి జబ్బు వచ్చి వినికిడి పోయిందని చదివాను; అందుకే నోట్ రాసి చూపెట్టడం, మాట పోయినందుకు అయి ఉండదు. సందర్భం కళ కావున చలసాని దాంట్లో ఏం సాధించారో, చెప్తే, అడిగితే, బావుండేది.

“ఏదో తామర కొలనులో మందారం పువ్వో అదేదో… మన అంపశయ్య నవీన్‌ రాశాడు దానిమీద. దట్స్‌ నాట్‌ క్రిటిసిజమ్‌. ఆయన సరిగ్గా ట్రాన్స్‌లేట్‌ చేయలేదని. పోనీ నువ్వు చెయ్‌. ఇంతకంటే బెటర్‌ ట్రాన్స్‌లేషన్‌ నువ్వు చేసి చూపించు. (తమ్మినేని యదుకుల) భూషణ్‌తో కూడా ఇదే గొడవ. భూషణ్‌ బాగా చదువుకుంటాడు. ఉమాకాన్తమ్‌ని గుర్తుంచుకున్నామా? లేదు. … కావ్యం మీద పుస్తకమే రాశాడాయన. నేటికాలపు కవి ఎలావుండాలి? అనో ఏమో. చదివారా మీరా పుస్తకం? ఏమైంది, ఎవరు గుర్తున్నారు? ”

ఇక్కడ రచనలని నిర్దిష్టంగా ప్రస్తావించకపోవడం, ఇంకాస్త లోతుకు వెళ్ళి తెలుసుకుందామనుకునే చదువరులలో, గందరగోళం కలిగిస్తుంది. “తామర కొలనులో మందారం,” అంటే వెల్చేరు, “Hibiscus on the Lake,” మనసులో మెదిలింది. దానిని నవీన్ విమర్శించారా? ఎక్కడ? తమ్మినేని, “నేటి కాలపు కవిత్వం – తీరుతెన్నులు,” లో “వెల్చేరు… ఏమి తేల్చారు? అన్న ప్రశ్న తలెత్తక మానదు. మందారం తేల లేదు … సరికదా,” అన్నారు. అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరుల, “నేటికాలపు కవిత్వం,” పీఠికలో చేకూరి, “సారాంశం చెపితే అక్కిరాజు ఉమాకాంతం గారి నిర్ణయాలు ముఖ్యం కాదు. ఆయన ఆవేదన నిజమైనది. ఆంతర్యం గొప్పది. సాహిత్య దీక్షా, సహేతుక వాద పద్ధతి ఈ జాతికి శాస్వతంగా ఇచ్చిన ఆయన ఆదర్శాలు,” అన్నారు.

“నేను సంపాదకునిగా ఉన్నన్నాళ్ళు, ఈమాటకు ఆ రకమైన స్ట్రక్చర్ ఇవ్వడానికి ప్రయత్నించాను.”

వేలూరి గారు “ఈమాట” ని న్యూయార్కర్ పత్రిక స్థాయిలో మలచాలని యత్నించడం చెప్పుకోదగ్గ విషయం. మొన్న నా వ్యాసానికి చివరి మెరుగులు దిద్దుతుండగా, సంపాదకులతో నేను ‘కామా’ ల గురించి తర్జన భర్జన పడాల్సొచ్చింది. విరామ చిహ్నాలవరకైనా, ఈమాట న్యూయార్కర్ పద్ధతిని అవలంబిస్తే బావుండు.

చివరగా, వేలూరి గారితో నాకు ఇరవై ఏళ్ళ క్రితం, డెట్రాయిట్ లో తానా సభల సందర్భంగా పరిచయం. కన్నెగంటి రామారావూ, నేనూ కాలువ పక్కన నడుస్తూ వేలూరి గారితో మాట్లాడుతుంటే, వారన్న ఓ మాట, “శ్రీశ్రీ కవిత్వం లోని మాటల కర్థం తెలియకుండానే పొగిడే వాళ్ళు అనేకం,” నాకిప్పటికీ గుర్తు. “షెల్లీ కవనపు హల్లీసకమూ,” అని తన్మయించడమే కాని, హల్లీసకం అంటే అర్థం తెలియదే అని నేను మనసులో అనుకున్నాను. అప్పటి నుండి, నా చదువు కాస్త కుంటు పడింది – అర్థం తెలియని పదం తగిలితే, నిఘంటువులో వెతక్కుండా ముందుకు పోలేక. అందుకూ, మరెన్నెటికో మార్గదర్శకులుగా ఉన్నందుకూ, శ్లాఘనీయులైన వేలూరి గారికి కృతజ్ఞతలతో,

కొడవళ్ళ హనుమంతరావు


03 April 2025 10:22 AM