మంగళంపల్లి వారి మీద వ్యాసం పునఃప్రచురించడం ముదావహం. ఆయన వున్న రోజుల్లో ‘ఈనాటి త్యాగరాజుగా’ ఒక వెలుగు వెలిగారు. తన అమృత గళంతో కర్నాటక సంగీతానికి ఎనలేని సేవ చేశారు. సంగీత విద్వాంసులకు వుండే piety ఆయనకు లేదు. జీవితంలోని సౌఖ్యాన్ని అనుభవిస్తూనే సంగీతానికి ఎనలేని సేవ చేశారు. నేను ఢిల్లీలో వున్న మూడు దశాబ్దాల కాలంలో ఆయన కచేరీలు ఎన్నో చూశాను. ఆయన కచ్చేరీలకు వయోలిన్, మృదంగం, ఘటం వాయించే వారు వాసి గలవారితో తప్ప ఆయన ధాటికి తట్టుకోవడం కష్టం. ఇసుక వేస్తే రాలనంతగా వచ్చేవారు సంగీత ప్రియులు ఆయన కచేరీలకు. ప్రముఖ వాగ్గేయకారులైన త్యాగయ్య, ముత్తయ్య, శ్యామయ్య తో పాటుగా తన స్వీయ రచనలను ఆలపించి మెప్పించేవారు. హనుమ అనుమ మనమా అనే కృతి, తనకు తెలియని కన్న తల్లిని స్మరించుకుంటూ రాసిన అమ్మ అకార ఉకార మకార కృతిలో తనను పెంచిన తల్లికి శివే శివే అని నివాళులు అర్పించటం శ్రోతలను ఎంతగానో అలరించింది. బాలమురళి మరియు సంగీత క్యాసెట్ కంపెనీ కలిసి ఒక ముప్ఫై సంవత్సరాల పాటు శాస్త్రీయ సంగీతాన్ని, ముఖ్యంగా త్యాగరాజ కృతులను, జన బాహుళ్యంలోకి తీసుకుపోవటానికి గొప్ప కృషి చేశారు. త్యాగయ్య సంస్కృత కీర్తనలు, (అందులోనే సామజవరగమన కూడా వుంది), పంచరత్న కీర్తనలు, తత్వబోధ కీర్తనలు, ఉత్సవ సంప్రదాయా కీర్తనలు వగైరా మరియు ఆయన స్వయంగా రచించి ఆలపించిన థిల్లానాలు, ముఖ్యంగా థిమ్న నాథ రాగమాలిక లో ఊపిరి పీల్చుకోకుండా ఆలపించే సంగతులు, సంగీత ప్రియులను నేటికీ అలరించుతున్నవి. ఓసారి మంగళంపల్లి వారి క్యాసెట్లు రెండిటిమీద ఆయన ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. అవి కాలగర్భంలో కలిసిపోయాయి. నేను రోజూ వాకింగ్ లో బాలమురళి అభోగి రాగంలో రచించిన వేగమె గావరా రంగయ్యా అనే కీర్తనను, సుదీర్ఘ రాగాలాపనను ఆస్వాదిస్తూ వుంటాను. నా వెనక నడిచే వాళ్ళు రోజూ ఇదేనా అంటుంటారు! సంగీత సంప్రదాయం వున్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, దురదృష్టవశాత్తూ నాకు సంగీతంలో ఏమాత్రం ప్రవేశం లేదు. కానీ విని ఆనందించే స్పృహ మాత్రం బాగా వుంది. సంగీత జ్ఞానం లేనందుకు ప్రాయశ్చిత్తంగా నా కూతురికి అభేరి అని నామకరణం చేసి, ఆమెకు సంగీతం నేర్పించుతూ శాస్త్రీయ సంగీత పట్ల నాకున్న అభిమానం చాటుకుంటున్నాను.

[ఈ వ్యాసం ఇప్పుడే తొలిసారిగా ప్రచురించబడింది. ‘పునః’ప్రచురణ కాదు. – సం.]