జీడిగుంట విజయసారథి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
“తురాయిపూలకొమ్మ నా Midsummer Day Dream. నిన్ను ఎవరు పలకరించనీ, పలకరించకపోనీ, నువ్వేది సాధించనీ, సాధించకపోనీ, క్రమం తప్పకుండా సంభవించే ఋతుపరిభ్రమణంలో నువ్వు కూడా ఉన్నావన్న మెలకువ ఒక్కటి చాలు..”
— ఎంత బాగుందో ఈ expression.
తురాయి పూలకొమ్మ నాకు వేసంగి మిట్ట మధ్యాహ్నపు కల..
శాఫో కవితా శకలం 48 లో “నువ్వొచ్చావు, నేన్నీగురించి ఉన్మత్తనై ఉండగా దహించుకుపోతున్న నా మనసుని చల్లార్చావు” వాక్యాలకు కాళిదాసు శ్లోకం లో “సంతప్తానాం త్వమహి శరణం'(దహించుకుపోతున్నవాళ్ళకి నువ్వే దిక్కు ) పాదానికి సాపత్యం భలేగా అనిపించింది.
క్యూబన్ కవయిత్రి మేరియా ఎలేనా క్రుజ్ బరేలా ను పరిచయం చేస్తూ ఆమె కవితకి మీ అనువాదం , మీరా భక్తి పాటతో పోలుస్తూ చేసిన విశ్లేషణకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పడం తప్ప ఇంకేం చెయ్యగలం..
ప్రేమకి ఉన్న Bitter-Sweet గుణాన్ని శాఫో కవితా శకలం 130 ఆధారం చేసుకుని అద్భుతంగా విశ్లేషించారు.. కమలాదాస్ & రేవతీ దేవి గార్ల కవితలు ఉదహరించి వారి భావజాలాన్ని వివరించినందుకు ధన్యవాదాలు…
మీరన్నట్టు, “ప్రేమవిద్యకి పాఠపుస్తకాలంటూ ఉంటే అది కవిత్వమే. ఒజ్జలు లేరుగాని కనుగొనగలిగితే నీ వంటి కవులే ప్రేమవిద్యకి బోధకులు.” కవిత్వం అంతగా చదవని నాలాంటి వాళ్ళు కూడా ఈ స్టేట్మెంట్ తో
నూటికి నూరుపాళ్లు.. ఏకీభవించి తీరతారు.. తెలుగు సినీ కవుల కలాల నుంచి జాలువారిన వందలాది పాటలకి లభించిన ఆదరణే అందుకు సాక్ష్యం, కారణం కూడాను. నాకైతే 80 ల నుంచి పుట్టిన చాలా మంది ప్రేమ గురించి చెప్పమంటే సినిమా పాటల పల్లవుల ద్వారానే చెపుతారనిపిస్తుంది. కనీసం భారతీయభాషల్లో పుట్టి పెరిగిన వారు. అరవైల్లో పుట్టిన నాలా పెద్దగా పోయెట్రీ చదవని వాళ్ళు కూడా. వీళ్ళందరికీ సినీ కవులే ప్రథమ ప్రేమవిద్యా బోధకులు.. అంతెందుకు మీ తిక్తమాధుర్యం ( bitter-sweet ) చదువుతుంటే మా అబ్బాయి సినిమాకి ప్రేమను నిర్వచిస్తూ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించిన ఒక పాట పల్లవి గుర్తొచ్చింది..
మధురానుభవమా ప్రేమా –
మతిలేని తనమా ప్రేమా
నువ్వు తేల్చగలవా కాలమా
మృదువైన స్వరమా ప్రేమా –
పదునైన శరమా ప్రేమా
బదులీయగలవా దైవమా
కోనేటి కలువా ప్రేమా –
కన్నీటి కొలువా ప్రేమా
బతికించు చలువా ప్రేమా –
చితి పేర్చు శిలువా ప్రేమా
ఎడబాటు పేరే ప్రేమా –
పొరబాటు దారే ప్రేమా
బదులీయమంటే మౌనమా..