తమ్మినేని యదుకుల భూషణ్ తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;తమ్మినేని యదుకుల భూషణ్

దేశంలో సైన్సు చదువుకున్న ఆచార్యులు ఎందరో ఉన్నారు. కానీ తమకు తెలిసిన విషయాన్ని ఇతరులతో పంచుకోవాలి అన్న ఉదారస్వభావం గలవారిని వేళ్ళ మీద లెక్కించగలము – అటువంటి వారిలో అగ్రగణ్యులు వేమూరి గారు. ప్రస్తుత వ్యాసం – కృత్రిమ మేధ (AI) పూర్వాపరాలను పరిశీలించి – ఏ రకంగా దాని అనువర్తనాలు భౌతిక రసాయనిక శాస్త్రాల స్థితిగతులను మార్చి, ఒక కొత్త విప్లవానికి దారితీశాయో – చివరిగా దానిలో భాగస్వాములైన శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం లభించడం మేలుమలుపుగా కొనియాడుతూ , సమాజం మీద కృత్రిమ మేధ ప్రభావం , మంచి చెడులను చర్చించి వదులుతుంది. ఈ వ్యాసంలో చర్చించిన
విషయాలు, ప్రస్తావించిన సంగతులు కొత్తవి. మన కుతూహలపరిధిని అనంతంగా విస్తరించే ఇవన్నీ ఆహ్వానించదగినవి- సహజంగా ఎన్నో పారిభాషిక పదాలు (చాలా వాటికీ బ్రాకెట్లలో ఆంగ్ల మూలాలు ఇచ్చారు) దొర్లాయి. ఎప్పటిలాగే – నాకు ఈ విభాగంలో కొన్ని అభ్యంతరాలున్నాయి.

సైన్సులో తెలుగు వ్యాసాలకు పాఠకులు – చాలావరకు చిన్నప్పుడు కనీసం పదవ తరగతి దాకా తెలుగు మీడియంలో చదువుకుని -కనీసం క. సా.గు కట్టడం తెలిసిన వారు, అంతేకాదు, కణం, ఉండుకం, క్లోమం , ప్లీహం , అణువు , పరమాణువు, యానకం, లోలకం, పౌనః పున్యం, తరంగ దైర్ఘ్యం లాంటి పదాలు చెవిన పడిన వారు – వారిలో కొందరు వయసు పై బడుతున్న రీత్యా , మరుపుదారిలో ఉన్న బాపతు అని చెప్పవచ్చు. కాబట్టి , మనకున్న పాఠక ప్రపంచం పరిమితులెరిగి , ఇదివరకు ప్రచారంలో ఉన్న పారిభాషిక పదాలను పొదుపుగా వాడుకోవాలి అన్న ధోరణి నాది.

‘బణువు’(molecule) అన్న ప్రయోగం నాకు ఇబ్బంది కలిగించింది- కారణం ఇప్పటికీ ప్రచారంలో ఉన్న పాఠ్యగ్రంథాల్లో Molecule ను అణువుగా, Atom ను పరమాణువుగా వ్యవహరిస్తున్నారు. అలాగే, Thermodyamics ను చాలా కాలంగా ‘ఉష్ణగతి శాస్త్రం’గా వ్యవహరిస్తున్నారు – దాన్ని అలాగే వాడటం మంచిది అనుకుంటాను. కొత్త పారిభాషిక పదాలు అవసరం కొద్దీ సృష్టించుకోవచ్చు.

నా స్నేహితుడు ఒకడు, 1994 లో అన్నా విశ్వవిద్యాలయంలో Remote Sensing లో ANN ( Artificial Neural Networks) వినియోగం మీద M.Tech ప్రాజెక్టు లో భాగంగా పరిశోధన పత్రం సమర్పించాడు. దాని సారాంశం (abstract ) ఆంగ్లంతో పాటు ఒక భారతీయ భాషలో ఉండాలి . అప్పుడు తెలుగులో abstract నేను రాసి పెట్టాను. ఆ సందర్భంలో – Remote Sensing ను దూరగ్రహణంగా , ANN ను కృత్రిమ నాడీ జాలాలు లో పేర్కొన్నాను. చెప్పొచ్ఛేది ఏమిటంటే, లేని వాటికి మనం హాయిగా కొత్త పారిభాషిక పదాలు సృష్టించుకోవచ్చు. ఇక, వ్యాసంలోకి ప్రవేశిస్తే, neural net ను నాడీ వలయంగా పేర్కొన్నారు, internet ను అంతర్జాలం అని పిలుస్తున్నామా , ఆ పంపిణీ మీద neural net ను నాడీ జాలం గా వ్యవరిస్తే బావుండేది. వలయం, వృత్తం అనగానే అందులో సంభాషణ / సంకర్షణ లకు స్థానం లేదు. ANN లకు అదే ఆయువుపట్టు కదా.

consciousness ను ప్రజ్ఞానంగా పేర్కొనడం ఇదే మొదలు అనుకుంటాను. చేతన / చైతన్యం అని వాడుకలో ఉంది. . సాహిత్యంలో Stream of consciousness – ను చైతన్య స్రవంతి అని , subconsciousness ను అవచేతన, Unconsciousness ను చక్కగా అచేతన అని వ్యవహరిస్తున్నాము.consciousness కు మన అనుభవానికి సంబంధం ఉంది. మేధకు , కృత్రిమ మేధకు – జ్ఞానం / సమాచారం ముఖ్యం. కృత్రిమమేధస్సు లో అనుభవానికి ఒక ప్రాతిపదిక లేదు. Consciosness ను ప్రజ్ఞానం అనడంలో ఇక్కడే చిక్కు వస్తుంది. అదేదో జ్ఞాన సంబంధి అనుకునే అవకాశం ఉంది , తద్భిన్నంగా consciousness అనుభవ సంబంధి. ప్రస్తుతం వాడుకలో ఉన్న చేతన చక్కగా సరిపోతుంది. Consciosness ప్రజ్ఞానం అయితే మరి subconsciousness / Unconsciousnessని ఏమని పిలవాలి? ఇలాంటి చిక్కులున్నాయి అనిపిస్తుంది. తీగ లాగితే డొంకంతా కదులుతుంది.

ఇక చిల్లర విషయాలు : క్రింది వాక్యాల్లో లోతైన జేబులు ( deep pockets) , పసరు తగ్గిపోతూందా (No more juice) అన్న ప్రయోగాలు:
“ఈ రెండు బహుమానాలూ అందుకున్న ఐదుగురిలో ‘ముగ్గురు లోతైన జేబులు ఉన్న’ గూగుల్ కంపెనీతో సంబంధం ఉన్న పరిశోధకులు.ఈ ధోరణి చూస్తూ ఉంటే భౌతిక, రసాయన శాస్త్రాలలో ‘పసరు తగ్గిపోతూందా ‘అనే అనుమానం ఒక పక్క.”

బ్రాకెట్లలో సూచించిన అమెరికన్ జాతీయాలకు (idioms ) కు తెలుగు అని తెలుస్తోంది. ‘చేతిలో కాసులు గల గల లాడుతున్న’ , ‘శక్తియుక్తులు నీరు కారిపోతున్నాయా ‘ లాంటి తెలుగు నుడికారం వాడితే సులభంగా అర్థమవుతుంది. ‘Emerging behaviour ‘ ను ‘హఠాదుత్పన్న ప్రవర్తన’ అనడం బరువుగా ఉన్నా అర్థబోధకు వచ్చిన చిక్కు లేదు. లేదంటే సరళంగా ఆకస్మిక ప్రవర్తన / సాహసిక ప్రవర్తన అని పిలవచ్చు. పొతే, వంగ భాషలో ‘emerging’ ని ‘ఉదీయమాన’ అని వ్యవహరిస్తారు. ఇక మిగిలినది brute force – చక్కగా తెలుగులో మొద్దు బలం అంటే సరిపోతుంది. చివరాఖరిగా ‘కపాలం మీది టోపారం’ నాకు అర్థం కాలేదు.

ప్రముఖ సైన్సు రచయితగా అప్పుడప్పుడు మంచి వ్యాసాలు రాస్తూ అందరి బుర్రల్లో తుప్పు వదలగొడుతున్న వేమూరి గారికి అభినందనలు , ఇలా, వారు ఇంకా ఎన్నో వ్యాసాలు రాసి పాఠకుల కుతూహలాన్ని ఇనుమడింప చేయగలరని ఆశిస్తాను.


18 November 2024 5:14 AM