పరిమి శ్రీరామనాథ్ తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
శ్రీ నౌడూరి మూర్తిగారికి హృదయపూర్వక నమస్కారాలు.
మేలైన మీ కలం నుండి జాలువారిన ఈ వ్యాసం విశ్వనాథ వారి “నీ రథము” కవిత యొక్క ఆత్మను హృద్యంగా బయలుపరచింది. ఆయన వ్రాసిన కొన్ని ముక్తకకవితలలోని భావుకత ఒక్కోసారి వారి పెద్ద రచనల కంటే ఉన్నతంగా కనిపిస్తుంది.
మీకు స్వాగత శుభాకాంక్షలతో,
విధేయుడు,
పరిమి శ్రీరామనాథ్.
నెలనెలా శ్రీ కామేశ్వరరావుగారి “మౌనంబంతట మాటలాడె” పద్యాలకోసం ఎదురుచూస్తున్నాను. “నీవారశూకవత్” అనే మంత్రపుష్పవాక్యంతో విలక్షణంగా ప్రారంభమైన ఈ కావ్యంలోని ప్రతీభాగమూ మనసును తీయగా స్పృశిస్తూనే ఉంది.
నేటి ఈ పద్యాలు ఎంతో హృదయావర్జకాలుగా ఉన్నాయి. “తలపులే కదలాడెనదే పదేపదే” అనే కూర్పు చంపకమాల పంక్తి చివరన ఎంతో మధురంగా ఉంది. పొల్లుపోబోని పలుకుల ఈ రామకథను శ్రీ కామేశ్వరరావుగారిలా అందిస్తుండగా ఆస్వాదించగలగడం నా వరకూ భాగ్యవిశేషమే.
రామాయణాన్ని పాయసాన్నంతోనూ, గురూపదేశంతోనూ, ధర్మదీక్షాయత్త ధనువుతోనూ, దివ్యసేతువుతోనూ హృద్యంగా పోల్చి, పద్యంగా మలచిన ఈ కవిప్రతిభకు ఎన్ని నమస్సులు చెప్పినా తక్కువే.
రాబోయే భాగాలకై వేయికళ్లతో ఎదురుచూస్తాను.
విదాంవిధేయుడు,
పరిమి శ్రీరామనాథ్.