ముకుంద రామారావు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;ముకుంద రామారావు

మరి కొన్ని సవరణలు ధన్యవాదాలు
ముందుగా కుటుంబరావు గారికి, ఈ వ్యాసం ప్రచురించిన ఈమాట సంపాదకులకు అనేక ధన్యవాదాలు. నా “అగమ్య గమ్యాలు” పుస్తకం కొనుక్కొని మరీ కుటుంబరావు గారు మా ఇంటికి వచ్చారు. ఆయనతో ఆనందంగా ఆ కాస్సేపూ గడిచింది. అందుకు వారికి మరికొన్ని ధన్యవాదాలు. ఈ వ్యాసంలో వారు ప్రస్తావించి,న నా ప్రస్తావన విషయంలో ఒకటి రెండు విషయాలు సవరణలు తప్పకుండా చెప్పుకోవాలి.

12ఏళ్ల వయస్సులో మా తాతయ్య దుర్గయ్య తన తల్లితో వెళ్లారు. తాతయ్యతో బాటు 14 ఏళ్ల వయస్సున్న అన్నయ్య, 9ఏళ్ల వయస్సులో చెల్లెలు కూడా వెళ్లారు. అలాగే ఎనిమిదేళ్ల వయస్సులో మా నాన్నమ్మ తన తల్లిదండ్రులతో, తమ్ముళ్లు, చెల్లెళ్లతో, అంతకు ముందే మరో ఓడలో వెళ్లింది. తాతయ్యా నాన్నమ్మ వేర్వేరు గ్రామాల వాళ్లు. వీరంతా ఒప్పంద కార్మికుల జాబితాలో వెళ్లారు. ఒప్పంద కార్మికులుగా తీసుకువెళ్లన వారందరినీ బ్రిటిష్ వారు కూలీల ముద్ర వేసారు. ఒప్పంద కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో కీలకపాత్ర పోషించిన, అప్పట్లో దక్షిణాఫ్రికాలోనే ఉన్న గాంధీ గారే, భారతదేశం వచ్చాక, జాతీయ కాంగ్రెస్ సదస్సులో ఈ సమస్యను లేవనెత్తుతూ ఆ వివక్షకు వ్యతిరేకంగా ఇలా చెప్పుకున్నారు.

ప్రతి భారతీయుడూ, మినహాయింపు లేకుండా, యూరోపియన్ల అంచనాల్లో ‘కూలీ’.
దుకాణదారులు ‘కూలీ దుకాణదారులు’. గుమాస్తాలు ‘కూలీ గుమస్తాలు’,
పాఠశాల ఉపాధ్యాయులు ‘కూలీ పాఠశాల ఉపాధ్యాయులు’.

అంచాత సహజంగానే, వ్యాపారులను లేదా ఆంగ్లంలో చదువుకున్న భారతీయులను సైతం గౌరవించడం లేదు. భేదం లేకుండా ప్రతి భారతీయుడినీ ధిక్కారంగా ‘కూలీ’ అంటున్నారు…. భారతీయులందరూ, వారు ఎవరైనా సరే, కూలీగా చూడబడుతున్నారు.

ఇది అప్పటి పరిస్థితి. కార్మికులుగా వెళ్లినవారిని “కూలీలు” అని పిలవడం మొదలుపెట్టి, వారు ఎక్కడ దిగినా నైపుణ్యం లేని కార్మికులుగా ఉపయోగించుకున్నారు.

మా తాతయ్య నాన్నమ్మ వాళ్లు అక్కడున్న పది సంవత్సరాల్లో వారి వివాహం, మా నాన్నగారి జననం కూడా అక్కడే జరిగింది.

నిజానికి బానిసత్వ నిర్మూలన వ్యవస్థ అమలయాక, అవసరానికి కావలసిన కార్మికుల్ని పూరించడానికి, ఒప్పంద కార్మిక వ్యవస్థను తమకు అనుకూలంగా బ్రిటన్ ఏర్పాటు చేసుకుంది. అన్ని విధాలుగా కార్మికులను వాడుకుంటూ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందడానికి ఈ వ్యవస్థ రూపొందించింది. ఈ వ్యవస్థలో పెట్టుబడిదారీ విధానం, ఒప్పంద కార్మిక విధానం చేయి చేయి కలిపి నడిచాయి. ఆయా దేశాల్లో మంచి పని పరిస్థితులు, తగినంత వేతనాన్ని కల్పించే చట్టపరమైన ఒప్పందాల ఆధారంగా అయిదు నుంచి పది సంవత్సరాల వరకూ పని చేయబోతున్నట్లుగా నమ్మించి వలసరాజ్య శక్తులు భారతీయ కార్మికుల్ని తీసుకుపోగలిగారు.

మా తాతయ్య నాన్నమ్మ లాంటి ఎందరినో 1838 నుంచి 1917 వరకు (80 సంవత్సరాలు), బ్రిటిష్ వారు దాదాపు 13 లక్షల మంది భారతీయులను తీసుకుపోయారు. అంచాత “అగమ్య గమ్యాలు” పుస్తకం నా మూలాలు తెలుసుకోవాలనే ప్రయత్నంతోనే మొదలు పెట్టినా, అప్పటి వారి పరిస్థితుల్ని తెలుసుకుందుకు నాకు పనికొచ్చింది.

గతం గురించి నిశ్శబ్దంగా ఉండలేక, ఆ మూలాల్ని అన్వేషించిన నా పరిశోధనలో, మా తాతయ్య వెళ్లిన 1904-1914మధ్య కాలంలోనే కాక, ఆ ముందూ వెనకా, మా తాతయ్య, నాన్నమ్మల్లాంటి వాళ్లు, ఒక్క దక్షిణాఫ్రికానే కాదు, అనేక దేశాలకు రైతులుగానో కార్మికులుగానో వలస వెళ్లారనీ, అలా వెళ్లినవారు అక్కడ పడరాని కష్టాలు పడ్డారనీ తెలిసింది.

ఆ 80 సంవత్సరాలూ, బ్రిటిష్ వలసవాదుల చక్కెర, రబ్బరు, టీ, కోకో తోటల పని కోసం ఒప్పంద కార్మిక వ్యవస్థ కొనసాగింది. అందులో మరీ ముఖ్యంగా చక్కెర కోసం. అది – హిందూ మహాసముద్రం మీదుగా (1. దక్షిణాఫ్రికా, 2. తూర్పు ఆఫ్రికా (కెన్యా-ఉగాండా), 3. సెషెల్స్, 4. రీయూనియన్, 5. మారిషస్), పసిఫిక్ మహాసముద్రం మీదుగా (6. ఫిజీ), అట్లాంటిక్ సముద్రం మీదుగా (7. ట్రినిడాడ్ టొబాగో, 8. డెమెరార లేక బ్రిటిష్ గయానా, 9. ఫ్రెంచ్ గయానా, 10. సురినామ్, 11. సెయింట్. కిట్స్, 12. నెవిస్, 13. సెయింట్. లూసియా, 14. బెలిజ్, 15. గ్వాడెలోప్, 16. మార్టినిక్, 17. గ్రెనెడా, 18. సెయింట్ విన్సెంట్, 19. సెయింట్ క్రోయి, 20. జమైకా) వరకూ కొనసాగింది.

ఈ పనిలో నేను ఆనందించిన విషయం ఒకటి తప్పకుండా అందరితో పంచుకోవాలి. 1860-1911 ల మధ్య ఒప్పంద కార్మికులుగా దక్షిణాఫ్రికాలోని నటాల్‌కు వెళ్లిన వారిగా నమోదైన 1,52,184 సభ్యుల మొత్తం సమాచారాన్ని ఈ క్రమంలో నేను సేకరించగలిగాను. ఆ వివరాల విశ్లేషణ నా పరిధిలో నేను కొంత మేర చేయగలిగాను, ఇంకా చేస్తున్నాను. నా దగ్గరున్న ఆ దక్షిణాఫ్రికా సమాచారం ఎన్నాళ్లుగానో వారి తాతయ్యలకోసం, మామ్మలకోసం, నాన్నలకోసం, అమ్మలకోసం, అన్నలకోసం, అక్కలకోసం వెతుకుతున్న వారికి కొందరికైనా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.

– ముకుంద రామారావు
హైదరాబాద్


02 May 2026 10:09 AM