Sodhini

సాయి బ్రహ్మానందం తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

శర్మగారికి వ్యంగ్యం పాలు ఎక్కువయ్యి బాలమురళి గురించి రాసింది నేను కల్పించి రాసాని అపోహ పడుతున్నారు. ఆయన (బాలమురళి) అన్న మాటలే రాసాను. రికార్డింగ్ ఉంది.

త్యాగరాజు 1847లో పరమపదించాడు. దాదాపు 180 సంవత్సరాలు కావొస్తోంది. ఈ కాలంలో ఏ కచేరీకెళ్ళినా త్యాగరాజ కీర్తనలు కనీసం 3 లేదా 4 అయినా పాడకుండా కచేరీలు జరగవు.
లేదంటూ, శర్మ గారు ఉదాహరణలు చూపించినా ఆశ్చర్యపోను.

తమిళనాడులో ఇలాంటి ప్రయోగాలు (త్యాగరాజు కృతులు లేకుండా) కొంతమంది చేసి విఫలం అయ్యారు.

త్యాగరాజు అన్ని మేలకర్త రాగాలనీ చిలకరించి ఎన్నో జన్యరాగాలు సృష్టించాడు.

ఒక్క తోడి రాగంలోనే 20కి పైగా కీర్తనలున్నాయి.

అంకెల గారడీ ఎందుక్కానీ, ఆయన తదనంతరం ఎంతో మంది వాగ్గేయకారులు (బాలమురళితో సహా) కొన్ని కీర్తనలు లేదా కృతులు కట్టినా అవి జన బాహుళ్యంలోకి వెళ్ళినవి వేళ్ళతో లెక్కపెట్టచ్చు.

బాలమురళి గారితో చాలా సార్లే సంభాషించాను–ఎదురుగానూ, గుంపులలోనూ.
విశేష ప్రజ్ఞావంతుడు. గాత్రం అద్భుతం. జనరంజకంగా పాడ గలరు. ఇవన్నీ ఒక ఎత్తు.
ఆయనలో నచ్చనివి కొన్ని ఉన్నాయి. అది–స్వోత్కర్ష. త్యాగరాజు 4 స్వరాలతో ఒక రాగం సృష్టిస్తే, నేను 3 స్వరాలతోనే ఒక రాగం కూర్చాను–అని ఆయనే చెప్పుకోవడం నాకు అంతగా మింగుడు పడలేదు.
నిజానికి–సంగీత శాస్త్రమూ, సృజనా , ప్రజ్ఞ, లోతైన అవగాహనా, ఇలాంటి అంశాలు తీసుకొని విడివిడిగా త్యాగరాజునీ, దీక్షితార్‌నీ, శ్యామశాస్త్రినీ, తీసుకొని వీరిని బాలమురళి పక్కన పెట్టలేము. ఎందుకంటే వారి కృతులు ఇప్పటికీ అందరూ పాడుతున్నారు.
ఇంకో పాతికేళ్ళలో ఆ త్రిమూర్తుల 200 సంవత్సరాల ఉత్సవాలు జరుపుంటారు.
బాలమురళి కృతులు ఎంతమంది పాడుతున్నారన్న ప్రశ్నకి జవాబు వెతకడం అంత కష్టమేమీ కాదు.
ఆయన స్వీయ రచనలు కూర్చిన పుస్తకం–గాన సూర్య కాంతి–అద్భుతంగా కూర్చారు; తెలుగు, తమిళ, కన్నడ భాషల లిపిలో ప్రచురించారు. అది నాకు బాగా నచ్చింది. గాన సూర్య కాంతి పుస్తకం కొందామంటే ఎక్కడా దొరకదు. ఎవరికీ పట్ట లేదు–అటు అభిమానులకీ, ఇటు శిష్యులకీ, మరో వైపు సంగీతజ్ఞులకీ.
ఇదీ ప్రస్తుత సంగీతం–గతి, సంగతీ.