BVV Prasad తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
మన లోపలి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసే ఒక్క పదబంధమో, వాక్యమో చాలు.. మనని, చాలా కాలం వెంటాడటానికి. మనలో అనూహ్యమైన మార్పులు తీసుకురావడానికి. అలాంటి ఊహలు కవికి ఎలా వస్తాయి? జీవితం పట్ల ఎంత శ్రద్ధా, అవగాహనా ఉంటే, జీవితాన్ని దర్శించడంలో ఎంత తాజా చూపు ఉంటే, అలాంటి భావాలు స్ఫురిస్తాయి.
నా వరకూ, 'అతడు గీసింది కన్నా చెరిపింది ఎక్కువ' అనే ఒక్క వాక్యం ప్రతిసారీ కొత్త మెలకువని ప్రసాదిస్తూనే ఉంటుంది. అనేక ఉద్వేగాలనీ, ఆలోచనలనీ, నమ్మకాలనీ చెరుపుకొంటూ మరింత లోతైన సత్యంలోకీ, సౌందర్యంలోకీ ప్రయాణిస్తున్నపుడల్లా ఈ ఒక్క మాటా మరింత రెలవెంట్ అవుతున్నట్లుంటుంది. 'కటకటాలన్నీ చెరిగిపోయి, కళ్ళు ఎగరటం నేర్చుకొన్న ' ట్లుంటుంది.
జగన్నాధరాజు గారూ, ఇస్మాయిల్ మిత్రమండలి తరఫున ఈ అమూల్య నిధిని అందిస్తున్న మీకు నా ధన్యవాదాలు.
ఇస్మాయిల్ గారి చాలా కవితలు నాకు పాఠాల్లాంటివి. నా కవిత్వంలో కనిపించే ప్రశాంతస్వరాన్ని, స్పష్టతనీ, స్వచ్చమైన సంవేదనాశీలతనీ చాలా వరకూ, ఆయన కవిత్వం నుండే నేర్చుకొన్నాను. ముఖ్యం గా కొన్ని కవితలూ, కొన్ని వ్యక్తీకరణలూ నాకు ఎప్పటికీ అద్భుతం గానే అనిపిస్తాయి.
అలాంటి కవితల్లో ఈ 'ధనియాల తిప్ప ' ఒకటి. ఒక కవితలోంచి, వృధా అయినవన్నీ శుభ్రంగా తుడిచేసి, స్వచ్చమైన సౌందర్యాన్ని మాత్రమే మిగల్చాలంటే, కవి జీవితానుభవంలో సంపూర్ణతా, పారదర్శకతా ఉండాలి, కవితాభివ్యక్తి పై కవికి పూర్తి అధికారం ఉండాలి. ఈ కవిత చదివినప్పుడల్లా, నాకు ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇలా ఊహించటం కవికి ఎలా సాధ్యమైందా అని. సగటు కవి ఈ దృశ్యాన్ని కవిత్వం చెయ్యాలంటే ఎంత ప్రయాసపడి ఉండేవాడు అనిపిస్తుంది.
సుమారు ముప్పై ఏళ్ళ క్రితం రాసిన ఈ కవిత, ఇవాళ రాసినంత తాజాగా ఉంటుంది. అలాగే, ఈ ధనియాల తిప్ప మనలో చాలా మంది జీవితాలలో ఎదురయ్యే ఉంటుంది.