G.RANGARAO తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
ఈ వ్యాసం చదువుతుంటే 50 ఏళ్లనాటి జ్ఞాపకాలు కళ్ళముందు కదిలాడాయి. ఏవే రేడియో రోజులు. ఆ కాలంలో రేడియో ఒక చిన్న సైజు టీవీ పెట్టెలా ఉండేది. టీవీ లాగే ఒక చోటే స్థిరంగా ఉండేది. అటుఇటు కదల్చటానికి వీలుండేది కాదు. దానికి సిగ్నల్ రావటానికి ఇంటి ముందు రెండు బొంగులకు పొడవైన వైరు కట్టేవాళ్ళు. దాన్నే ఏరియల్ అనేవాళ్ళు.
అవి కరెంటు లేని రోజులు. రేడియో బ్యాటరీ మీద నడిచేది. స్థితిమంతుల ఇళ్లలోనే ఉండేది రేడియో. దాని చుట్టూ జనం చేరేవాళ్ళు. ఆ కాలంలో రేడియో ఒక్కటే ప్రసార సాధనం. వార్తాపత్రికలు విజయవాడ నుంచి వచ్చేవి. పల్లెటూర్లకి ఆలస్యంగా వచ్చేవి. పత్రికలు చదివితే నిన్న ఏమి జరిగిందో తెలుస్తుంది. రేడియో వింటే ప్రస్తుతం ఏమి జరుగుతుందో తెలుస్తుంది. అంత తేడా రేడియోకి పత్రికలకు. వ్యవసాయం, వాతావరణం, రామాయణం, మహాభారతం మీద వ్యాఖ్యానం, వార్తలు, కార్మికుల కార్యక్రమం, సినిమా పాటలు, శాస్త్రీయ సంగీతం, హరికథ, బుర్రకథ అబ్బో ఒకటేమిటి ఎన్నో కార్యక్రమాలు వచ్చేవి. శ్రోతలను అలరించేవి. రేడియోలో సినిమా కూడా వచ్చేది. దాన్ని సంక్షిప్త శబ్ద చిత్రం అనేవారు. అంటే కేవలం ఆడియో అన్న మాట.
ఆ తర్వాత రేడియో రూపాంతరం చెంది ట్రాన్సిస్టర్ గా మారిపోయింది. అది ఆ కాలంలో గొప్ప విప్లవాత్మక మార్పుగా భావించారు. ట్రాన్సిస్టర్ ఖరీదు తక్కువ. చేతితో పట్టుకొని ఎక్కడికైనా తీసుకుపోవచ్చు. మొదట్లో పెద్దదిగా వున్నా రానురాను చిన్న సైజు ట్రాన్సిస్టర్లు వచ్చాయి మార్కెట్లోకి. మర్ఫీ, బుష్, బాగా పేరుపొందిన బ్రాండ్లు. ఆ తర్వాత ఫిలిప్స్ వచ్చి మిగిలిన బ్రాండ్లను మార్కెట్లో లేకుండా చేసింది. ఖరీదైన ట్రాన్సిస్టర్‌లో బ్యాండ్లు ఉండేవి. మీడియం వేవ్, షార్ట్ వేవ్ 1, షార్ట్ వేవ్ 2 లాగా. మీడియం వేవ్ లో స్థానిక స్టేషన్ల ప్రసారాలు వచ్చేవి. రేడియో టైం అంటే కచ్చితమైన సమయం అనుకునేవారు.
రోజూ ఉదయాన్నే 5.55 కి వాల్టర్ కాఫ్మన్ అనే పాశ్చాత్య సంగీత పండితుడు కంపోజ్ చేసిన సంతక స్వరంతో మొదలై వినసొంపైన కంఠం పలికేది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358 మీటర్లు అనగా 857 కిలోహెర్ట్స్ మీద జరిగే ప్రసారాలు అన్న మాటలతో మొదలయ్యేది ప్రసారం. వివిధ భారతిలో జనరంజని కార్యక్రమంలో రోజుకు మూడుసార్లు తెలుగు సినిమా పాటలు వచ్చేవి. అన్ని ఇళ్లలో ఆ సమయంలో అదే కార్యక్రమాన్ని చాలా ఇష్టంగా వినేవారు. పలానా పాట కావాలని ఉత్తరం రాసిన శ్రోతల పేర్లు కూడా చదివేవారు. పిల్లలు తప్పిపోతే రేడియోలో ప్రకటన చేయించేవాళ్ళు. అనేక వస్తువుల ధరలు కూడా రేడియోలో చెప్పేవాళ్ళు. పురాణాల మీద ఉషశ్రీ వ్యాఖ్యానం కోసం ఎదురుచూసి మరీ వినేవాళ్ళు.
మాది ప్రకాశం జిల్లా. మాకు విజయవాడ కార్యక్రమాలు బాగా వచ్చేవి. తర్వాత కడప నుంచి కూడా వచ్చేవి. విశాఖపట్నం హైదరాబాద్ కార్యక్రమాలు బలహీనంగా వచ్చేవి. సిగ్నల్ సరిగా లేనందువలన. షార్ట్ వేవ్ మీద సిలోన్ నుంచి వచ్చే బైబిల్ కార్యక్రమంలో సినిమా పాటలు మాత్రం వినేవాళ్ళు!
రేడియోలో వార్తలు చదివే వాళ్లకు మంచి గుర్తింపు ఉండేది. మావిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, అద్దంకి మన్నార్, కందుకూరి సూర్యనారాయణ లాంటి పేర్లు ఇప్పటికీ గుర్తే. వీరు ఢిల్లీ నుంచి వచ్చే తెలుగు వార్తలు చదివేవారు. ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ నుంచి రిలే అయ్యేవి. ఆదివారం రాత్రి భోజనాలు అయ్యాక సంక్షిప్త శబ్ద చిత్రం కోసం రేడియో చుట్టూ జనం మూగేవాళ్ళు. శనివారం రాత్రి 9.30 నుంచి 11 గంటల వరకు జాతీయ సంగీత కార్యక్రమం వచ్చేది. మంగళంపల్లి సహా అందరూ తమ సంగీత ప్రయాణాన్ని రేడియో ద్వారానే ప్రారంభించేవాళ్లు. బి అని బి హై అని, ఏ అని ఏ హై అని గ్రేడ్లు ఉండేవి సంగీత కళాకారులకు. రేడియో ఆర్టిస్ట్ అంటే అదో పెద్ద గౌరవం కళాకారులకు. క్రికెట్ మ్యాచ్ గురించి కామెంట్రీ వినాలంటే రేడియో ఒక్కటే మార్గం. రేడియోకి ఒక ఆదర్శం ఉండేది. అల్లరి చిల్లరి కార్యక్రమాలు అందులో వచ్చేవి కావు. ప్రతి కార్యక్రమంలో ఒక అభ్యుదయం నిమిడి ఉండేది.
ట్రాన్సిస్టర్ రాకముందు పల్లెటూళ్లలో కమ్యూనిటీ రేడియో అని ఉండేది. అక్కడికి చేరేవారు పురుష జనం అంతా! రేడియోని గురించి మరో ఆసక్తికర విషయం ఏమిటంటే రేడియోకి లైసెన్స్ ఉండేది 1970 దశకం చివరి వరకు. అలాగే సైకిల్‌కి కూడా లైసెన్స్ ఉండేదట! ఏడాదికి ఒకసారి పోస్ట్ ఆఫీస్ లో కట్టాలి రేడియో లైసెన్స్ ఫీజు.
ట్రాన్సిస్టర్ వచ్చాక కట్నం కింద రేడియో, సైకిల్, చేతి వాచీ లాంటివి కూడా చేరేవి. ఆ రోజులు చాలా బాగుండేవి. మనిషికి తెలిసిన రేడియోని రూపొందించటానికి ఎన్నో దశాబ్దాలుగా శోధించి, శ్రమించి విజయాన్ని సాధించిన శాస్త్రవేత్తల గురించి హనుమంతరావు గారి వ్యాసం చదువుతుంటే మనసంతా నోస్టాల్జిక్ జ్ఞాపకాలతో నిండిపోయింది. మళ్ళీ రావుకదా ఆ తీపి రోజులు. ఒక్కసారిగా కాలాన్ని 50 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లిన కొడవళ్ళ హనుమంతరావు గారికి కృతజ్ఞతలు.