కొడవళ్ల హనుమంతరావు గారి అభిప్రాయం చాలా సంతోషం కలిగించింది – వారు ఈ వ్యాసాన్ని పూర్తిగా చదవటమే కాకుండా ప్రశ్నలు కూడ లేవదీసినందుకు.
మొదటిది వరూధిని గురించి. ఆ పాత్ర మార్కండేయ పురాణ కథలో ఉందికదా, పెద్దన సృష్టించాడనటం భావ్యమేనా అని ప్రశ్న. నా అభిప్రాయంలో పాత్రల పేర్లు ఒకటై, ప్రవర్తనలో సామ్యం ఉన్నంతమాత్రాన రెండూ ఒకటి కావు; పెద్దన వరూధిని మాటతీరు గాని, తార్కిక ప్రతిభ గాని మూల వరూధినిలో లేవు. పెద్దన వరూధిని, నా అభిప్రాయంలో, ఒక స్వయంప్రతిపత్తి వున్న వ్యక్తి, మూలంలోని వరూధినికి, ఈ వరూధినికి ఎంతో వ్యత్యాసం వుంది. అందరికీ అందుబాటులో ఉంటుందని ఇక్కడ మార్కండేయ పురాణంలో ప్రవరుని ఘట్టం ఆంగ్లానువాదానికి లంకె ఇస్తున్నాను, చూడండి. . ఈమాటలో చాలాకాలం క్రితం మనుచరిత్ర ఉంచాను. బేరీజు వేసి చూసుకోవచ్చు.
ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఈ పద్యం చూడండి:
ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడుదు భూసురేంద్ర యే
కాంతమునందు నున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు లా
గింతియె కాక నీవెరుగవే మును వచ్చిన త్రోవ చొప్పు నీ
కింత భయంబులే కడుగ నెల్లిదమైతిమె మాటలేటికిన్
ఒక్కసారి కళ్లు మూసుకుని ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి – “ఇంతలు కన్నులుండ” అనే ఎత్తుగడలోనే ఆమె గడుసుదనం కనబడటం లేదూ? “ఏకాంతమునందు నున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు లాగు” అని అతని మీద కృత్రిమకోపాన్ని చూపటం, “ఇంతియె కాక నీవెరుగవే మును వచ్చిన త్రోవ చొప్పు” అని నీ దొంగాట నాకు తెలియదా అన్నట్టు ప్రశ్నించటం, “నీకింత భయంబులే కడుగ నెల్లిదమైతిమె” అని బింకాన్ని ప్రదర్శించటం, ఆ వెంటనే తన మనసులోని తొందరపాటుని బయటపడేస్తూ “మాటలేటికిన్” అని అతన్ని తొందరచెయ్యటం – ఇన్నిన్ని భావాల పరంపరని ఒక్క చిన్నపద్యంలో మనముందు పరిచాడు పెద్దన.
ఇదొక్కటే కాదు, వరూధిని పలికే ప్రతి మాట, దాని వెనక వుండే ధ్వని, దానితో కదిలే వరూధిని హావభావాలు – ఒక్కొక్కపద్యాన్ని ఒక రసగుళికగా చేసినయ్.
ఈ వరూధినికీ మార్కండేయ పురాణంలో ప్రవరుణ్ణి ప్రాధేయపడుతూ కొన్నాళ్లైనా ఉండమని వేడుకుంటూ ‘పూలిస్తాను, పండ్లిస్తాను, వాడిపోని యవ్వనమిస్తా’ నని బతిమాలుకునే వరూధినికీ పోలికైనా వుందా?
రెండవది కట్టమంచి వారి గురించి. విదేశాలకు వెళ్లాక తెలుగు సాహిత్యం మీద తనకున్న అభిప్రాయాలు ఎంతో మారాయని పుస్తకం అవతారికలో తనే రాసుకున్నారు, అది నేను కనుక్కున్న విషయం కాదు. “మనుచరిత్రము వసుచరిత్రము వీనికి నడుమ వ్రాయబడిన గ్రంథములును ఇంత గుణశూన్యములు కావు. చేమకూర వేంకటకవి కృతులు తప్ప అను సమయము గూఢము” అని ఒక ఫుట్ నోట్ లో అన్నారు; బాగుంది. ఆ తర్వాత పాశ్చాత్యకవుల సద్గుణాల్ని తనివితీరా కీర్తించాక మరో ఫుట్ నోట్ లో “ఇచట నైరోపాలోని కళలగూర్చి చెప్పబడిన స్తుతియంతయు భారతాదుల రచించిన మన పూర్వుల యందును జెల్లును. చెల్లనివారెవరనగా దేశక్షయకాలపు హిందూకవులగు ప్రబంధకారులు.” అని ప్రకటించారు కదా! ఇకపోతే, వారు ప్రస్తావించిన కొన్ని టాపిక్లు: “ప్రాచీనుల మోహతాపము”, “తుచ్చశృంగారములకు గారణములు మన యనాచారములు”, “అసహ్యశృంగారము”, “తుచ్చశృంగారములకు హేతువులు”.
కవిత్వతత్త్వవిచారం నుంచి అనేక పుటల్ని ఆధారాలుగా చూపించవచ్చు గాని అవన్నీ టైప్ చేసే ఓపిక ఇప్పుడు లేదు. పరుచూరి శ్రీనివాస్ గారు పంపిన డిజిటల్ కాపీ నాదగ్గర వుంది; చదవాలని నిజంగా ఉత్సాహం వున్నవారుంటే ఈ పత్రిక ప్రస్తుతసంపాదకులకు దాన్నిపంపి సైట్ లో ఉంచమని కోరతాను.