Rao Vemuri తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;Rao Vemuri

అయ్యా! యదుకులభూషణ్ గారూ:

నేను రాసే సైన్సు వ్యాసాలు చదివి, స్పందించే అతి కొద్ధిమందిలో మీరు ఒకరు! కనుక మీ స్పందనకి నా జవాబులు – క్లుప్తంగా.

(1) అణువు, పరమాణువు, వగైరా

మంత్రపుష్పంలో …

తస్య మధ్యే వహ్ని శిఖా అణీయో”ర్ధ్వా వ్యవస్థితా
…..
నీవారసూకవత్తన్వీ పీతా భా”స్వత్వణూపమా

అణువు ప్రస్తావన (నిర్వచనం) కనిపిస్తుంది. ఈ అణువు atomతో సమానార్థకం, moleculeతో కాదు. ఎందుకంటే …

(క) ఒక హిమోగ్లోబిన్ బణువు (molecule) ఉదజని అణువు (atom) కంటే 64,500 రెట్లు ఎక్కువ బరువు! ఒక హిమోగ్లోబిన్ బణువులో (molecule) 10,000 వరకు (ఖచ్చితమైన లెక్క నాకు తెలియదు) ఉదజని, కర్బనం, నత్రజని, ఆమ్లజని, గంధకం అణువులతో పాటు ఖచ్చితంగా నాలుగు ఇనుము అణువులు (atoms) ఉన్నాయి. ఇంత తేడా ఉన్నప్పుడు హిమోగ్లోబిన్‍ని “అణువు” అని ఏ ముఖం పెట్టుకుని అనగలం? హిమోగ్లోబిన్, DNA వగైరాలు బణువులే! అణువులు కాదు. నిజానికి అవి బృహత్ బణువులు (mega molecules).
(చ) నిజానికి అణువులో (atom) అంతర్భాగమైన ఎలక్ట్రానులు, ప్రోటానులు, నూట్రానులు పరమాణువులు (sub-atomic particles). వీటిలో అంతర్భాగాలైన క్వార్కులు “పరమాణు రేణువులు.”
(ట) నీరు, మైలుతుత్తం, పంచదార, కిరసనాయిలు, వగైరాలలో అతి చిన్న “రేణువులని” బణువులు (molecules) అందాం. షడ్దర్శనాలలో కాణాదుడు ఇలాంటి బణువులనే “ద్వియాణువు, త్రయాణువు,” అంటూ అణువులకి, బణువులకి తేడాని చెప్పేడు. ఇదంతా నా సొంత పైత్యం కాదు.

(2) మొసలి కన్నీళ్లు, ముద్రారాక్షసం, సింహభాగం వంటి ప్రయోగాలు “వైరల్” అవుతోన్న ఈ రోజుల్లో “లోతైన జేబులు” అనే ప్రయోగానికి కూడా తావు ఉందనే ధైర్యంతోనే ఆ ప్రయోగం చేసేను.

(3) “పస” అనే బుర్రలో ఉంది. అది కాగితం మీద “పసరు” అని పడ్డాది. నా మనోనేత్రం భౌతిక నేత్రాన్ని ధిక్కరించింది. తరువాత సంపాదకులు “ప్రూఫులు” చూడమని ఇచ్చినప్పుడు “పసరు” కనిపించింది. పసరు ఇక్కడ నప్పుతుందో నప్పదో చూద్దామని బహుజనపల్లి సీతారామాచార్యులు ని సంప్రదించి “సరిపోతుందిలే” అని సమాధానపడ్డాను. అంతేకాని ఇది ఇంగ్లీషు నుడికారానికి అనువాదం కాదు.

(a) పస: శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912: దే. వి. 1. సారము; 2. సమృద్ధి; 3. చాతుర్యము.
“సీ. తననీతిపస యుగంధర భట్టి చాణక్యఘనచాతురికి నిదర్శనముగాఁగ.”

(b) పసరు: శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912: వై. వి. వ్యాపనము.”ఒకింత బుద్ధిలోఁ బసరిడి చూడుమా.” (ఇక్కడ పసరిడి అనఁగా ఆలోచించి యనుట.) హరి. ఉ. ౮, ఆ.

(4) మిగిలిన అంశాలు. నేను 1968 నుండి తెలుగులో సైన్సు వ్యాసాలు రాస్తున్నాను. ఆ రోజులలో నా దగ్గర నిఘంటువులు లేవు. ఈనాటిలా online నిఘంటువులు అప్పట్లో అస్సలు లేవు. అన్నీ స్వకపోలకల్పితాలే! వాటినే ఆకారాదిగా అమర్చుకుని వాటినే పదేపదే వాడుతూ రచనా వ్యాసంగం కొనసాగిస్తున్నాను. నా నిఘంటువే నేను వాడే పదజాలానికి ఆధారం. ఉత్సాహం ఉంటే ఇక్కడ చూడండి:
వేమూరి – Wikibooks

ధన్యవాదాలు!!


24 November 2024 6:04 AM

గణపతి;Rao Vemuri

This kind of material needs more explanation and motivation to be enjoyable. Good try.


26 July 2008 9:14 PM