Rohini Vanjari తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
చీకటి కొందరికి భయం. కొందరికి అభయం. కొందరికి ఆటవిడుపు. మరికొందరికి అనుక్షణం నరకం. కథలో లాంటి నరసింహారావులు చాలామంది ఉంటారు సమాజంలో. ఆడదాని కలలను, కళలను, ఆశలను, ఊహలను ఎప్పటికప్పుడు అణిచివేసే కొండచిలువలు కోకొల్లలు. కొందరు మౌనంతో కాల్చేస్తారు. మరికొందరు సిగరెట్టు పీక తో కాలుస్తారు. దేహాన్ని, మనసుని కూడా. ఎక్కడ భార్యకి చనువు ఇస్తే నెత్తిన ఎక్కి కూర్చుంటుంది అని అనుక్షణం అభద్రతా భావంతో వాళ్ళు ఒక్క మాట ఆప్యాయంగా మాట్లాడరు. ఒక్క చిన్న నవ్వుకానీ, ప్రశంస కానీ వారు చేయరు. ఆడదాన్ని క్రీగంటితో భయపెడుతూ, క్రోధంతో ఇంట్లోని వస్తువుల రూపాలు మారుస్తూ, ఇంకా కొందరు పశుకాముకులు స్త్రీ దేహాన్ని హింసిస్తూ పైశాసిక ఆనందాన్ని పొందుతారు. కానీ తాము ఏం కోల్పోతున్నామో వారికి ఎప్పటికీ తెలియదు.
అయితే రచయిత శ్రీనివాస్ గౌడ్ తాను ఊహించిన హింసను కథలో దృశ్యరూపం చేసారు. ఇటువంటివి ఒక్కోసారి కథ నడతకు అవసరమైన బలాన్ని చేకూర్చవచ్చునేమో అనిపిస్తుంది. ఇక ఆమె తనమీద రోజు జరిగే హింసని మౌనంగా భరించింది. తన జీవితంలో ప్రేమ, ఆనందం ఏమి లేని మోడులా ఉన్నా, సమాజం కోసం అతన్ని భరించింది. తన బంధువు పద్దు మీద అతను నేరం జరిపినా సహించింది. కానీ వావివరుసలు మాని కన్నబిడ్డ సుమతిమీద అతని దాడి ప్రయత్నాన్ని మాత్రం ఆమె మాతృ హృదయం సహించలేకపోయింది. అపర కాళికలా అతనిమీద విరుచుకుపడింది. కొండచిలువ చుట్టు నుంచి స్వేచ్చని పొందింది. కొండచిలువ తనని చుట్టడం మొదలు పెట్టిన రోజే ఆమెలో ఈ మార్పు వచ్చిఉంటే, బహుశా అది కథ కాకపోయిఉండవచ్చు కానీ, కథ కాకపోయినా పర్వాలేదు ఆమెలు, అమ్మలు, భార్యలు, కూతుర్లు ఎప్పటికీ ఇటువంటి కొండచిలువల బారిన పడకుండా ఎగిరిపోవడానికి వారికి కొత్త రెక్కలు పుట్టుకువస్తే బాగుండు అనిపించింది కథ చదివాక. ఎవరో ఒక ఆమ్మో, అక్కో, కూతురో ఒకడుగు ముందుకు వేయాలి కొండచిలువల చేతికి చిక్కకుండా.
” ధైర్యంగా ఎగిరి ముందుగు పోతూ ఉంటే దారి దానికదే విచ్చుకుంటూ ఉంది”. ఈ ముగింపు వాక్యం కథకు బలాన్నిచ్చింది. ఆశావహ ముగింపు కథకి కొత్త రెక్కలు తొడిగింది.
శ్రీనివాస్ గౌడ్ గారికి అభినందనలు.